Saturday, March 10, 2012

నిద్రపోనీ ఇంకాసేపు


ఎవరిదో మాట
తల వాకిట మొరుగుతోంది
అటు రమ్మని పిలుస్తోంది
కాల భైరవ స్వరాన మెలి తిరుగుతూ ఒక స్మృతి నరాలలో
నిద్రా వాక్యాన్ని పూర్ణ బిందువుకు చేరనివ్వదు కుక్క
రెప్పల కింద నిప్పులు దాచి పడుకుని ఉంది తోడేలు

పది వేల తలల్తో ఇరవై వేల చేతులతో గగన మంతా పాకి,
బాగా వంగి మొక్కమంటున్నది, దీన్ని ఎక్కడో విన్నట్టున్నది
అదే వెలుగనిపించే అంధకారం, అభయం వంటి భయంకరం
పెంకులు పెంకులుగా గింజలు లేని కంకులుగా రాలుతున్నది
దాని మెడ చుట్టూ పటకా గుర్తు, మాసిన భ్రాంతి వలయం

పో పో మొరగకు
చాతుర్వర్ణ్యమో కులమో నన్నింకా చర్చించుకోనీ
వేరువాదమో ఐక్యనాదమో ఇంకొన్ని రాళ్లు నాపై విసురుకోనీ
సంక్షేమమో కరవు వ్యాపారమో ఒక నాటకాన్ని వినోదించనీ
ఆత్మహత్యలో చాటు హత్యలో నేల చెప్పే మాటలు విననీ
మెత్తగ పలకాలో ఒత్తి మాట్లాడాలో కవన తర్కం ముగియనీ

పో పో, ఇది నా వళ్లు ఇవి నా కళ్లు వీళ్లు నా వాళ్లు
నువ్వెవరి దానవో, మొరగకు నా తల వాకిట
కను దెరవనీకు వదలనీకు ఈ నివురు వంటి నిద్దుర

పో, పో, ఇంకాసేపు నన్ను నిద్ర పోనీ
పో, ఇంకాస్త చించెయ్ ప్రపంచ విస్తరిని

Wednesday, March 7, 2012

అమ్మా! నాన్నా!


పొద్దున్నే కళ్లానికి మాసూలు వచ్చింది
పశువుల కాళ్ల కింద కంకులు నలిగాయి
తూర్పారబోసే ఎత్తు బల్లల మీద చేటలు ఆడాయి
అమ్మ ఆవు కొత్త శిశువును నాల్కతో శుభ్రం చేసినట్లు
కుప్ప మీద తాలును చేటల చేతులు తుడిచాయి
గింజలు బంగారు రంగులో నవ్వాయి
సాయంత్రమయ్యింది
రైతు, రైతమ్మ నుంచుని ఉండి పోయాయారు
పని అయిపోయింది, ఇక వాళ్లు పరాయి వాళ్లు

గింజల కుప్ప మాట్లాడింది:
అమ్మా! నాన్నా! ఇక వెళ్లి రండి
పురిటి ఖర్చుల కోసం మీకు అప్పులిచ్చినవాళ్లు వస్తారు
గోనె సంచులలో బిగించి మమ్మల్ని తీసుకుపోతారు
మమ్మల్ని ఊరూరు తిప్పుతారు ఎవరివో కడుపులు నిండుతాయి
ఇంటికి వెళ్లి ఖాళీ గరిసెల పక్కన ఖాళీ మనస్సులతో నిద్రపొండి
మీ చెమట పొత్తిళ్లలోని లాలనను మరిచిపోము
పుడితే మళ్లీ మీ కడుపుననే పుట్టాలి
గిట్టడానికి చాల మార్గాలు, పుట్టడానికి
మీ అరిచేతులలోని ఒకే ఒక గరకు దారి మాకు, ఇప్పటికి సెలవు

(ఒక నోట్: ఇది నేను ఎప్పుడో రాసి పా‍రేసుకున్నానని, కాదు, ఎవరో రాస్తే చాల ఇష్టంగా చదివి నేను రాశానని భ్రమిస్తున్నానని నిరతం అనిపించే కవిత. ఇప్పుడిది జ్ఙాపకం లోంచి తిరుగ రాసినదే గాని, ఇప్పుడే కొత్తగా రాసింది కాదు. ఎక్కడున్నయ్ ఆ మాసూలు కళ్లాలు, పశువులతో కంకులు తొక్కించడాలు? పురిటి ఖర్చులకు ఇచ్చిన అప్పులకు బిడ్డలను తీసుకెళ్లే వాళ్లు మాత్రం ఇప్పటికీ పదిలం). 

పొద్దు.కామ్ లో 'పిచికగూడు లో కవిత్వం కిచకిచలు....'

Saturday, March 3, 2012

చీకటి దీపం


చీకటిలో దీపం లేకుండా, అడివిలో గొడ్డలి లేకుండా ప్రయాణమా?
పొగ కళ్లలో పడకుండా, విసురుకు చేతి వేళ్లు తెగకుండా జాగ్రత్త!

మసక మసక నొప్పి

సాయంత్రం ఊరక తొలుస్తుంది, నిన్ను దూరంగా కూర్చోబెట్టి
రక్తమాంసాల పొరల్లోంచి వెన్నెల పారిపోతుంది
మిగులు చీకటిలో పదునైన డేగల గోళ్లు
తొలిచే కొద్దీ దాహం ఊరుతుంది

సూది మొనతో

గాలి ఉంది పువ్వులున్నాయి ఆకుల కింద నీడలు కదులుతున్నాయి
అడువులింకా అంతరించలేదని పిల్లల పుస్తకాల్లో నెమలీకలు అన్నాయి
మళ్లీ రావడానికి ఇక్కడ స్థలం ఉంటుందో కబ్జా అయిపోతుందోనని
పొద్దు పొడిచినా వెళ్లిపోవడానికి ఇష్టపడని ఒక జ్ఙాపకం
ఆకాశంలో ఆ శ్వేత నేత్రం చందమామ కాదు

దొర్లుతున్న తలలు తోడు కోసం తడుముకుంటున్న శరీరాలు
ఇది నగరం
శోకపు రాత్రులు భయపడిన పగళ్లు రోడ్ల మీద అదృశ్య గుహలు

మలుపుల వద్ద కత్తిరించబడి నల్ల రిబ్బనులా పరుచుకున్న సరస్సు
ఇది రాదారి
పుండ్లు పడిన పాదాలు అద్దం బిళ్లల వంటి కళ్లు తూలుతూ ఊరు

ఒక హఠయోగి కోసం వెదుకుతున్నాను మఠం శిథిలాలలో లేడు
ఇది మార్కెట్
అన్నీ అమ్మకపు సరుకులు కుప్పలుగా కుప్పలుగా దేహాల ముక్కలు

ఊహా ద్రిమ్మరి ఒకడు ఏక్‍తార పట్టుకుని వీథి వీథి తిరుగుతుంటాడు
నాద ప్రేమ
బేరసారాల మధ్య అప్పుడప్పుడు కొన్ని కళ్లు అటు వైపు ఆశ పడతాయి

ప్లాస్టిక్ సంచుల బరువును ఓపలేక నోటిలో కొంగు కుక్కుకుని వెక్కుతున్న
చెరువు
నగరాన్ని తగలబెట్టకుండా ఉంటానికి ఉపాయం అడగాలి హఠయోగిని

మరీ ఇంత క్రమం తప్పని నడక మంచిది కాదు పదాలకు
వేళ్లు కొంచెం తెగడం, కళ్లు కొంచెం పొగ చూరడం మంచిది
రొట్టె మీద వెన్నపూసలా ఈ నొప్పి మసక తప్పక అవసరం

ఎక్కడి నుంచి వచ్చామో ఎక్కడికి వెళ్తున్నామో తెలియక పోవడం,
పద్య పాదాల కొలతలకు తగినట్లు నగరాల్ని కుట్టకపోడం మంచిదని
అప్పుడే అనుమానపడి ఉంటే
జారిపోయేవి కాదేమో కళ్ల నుంచి దీపం, బుజం మీంచి గొడ్డలి,
వస్తుమార్పిడి కాలం నాటి ఒక బాగా పాత ఏక్ తార,
ఈ తడి కన్నుల వెనుక ఉండిన నిజం నవ్వుల నువ్వూ నేనూ 
                                                            3-3-2-12

ఇంకోలా

నిన్నా మొన్నా మరి చాల సార్లు నువ్వు  ఎదురయ్యావు
నువ్వు అచ్చం నీ లాగే వున్నావు
చెయ్యి ఊపానో లేదో ఊపానని అనుకుని వెళ్లిపోయానో http://www.newaavakaaya.com/index.php?option=com_content&view=article&id=663%3Ainkola&catid=40%3Aselayeru-poetry&Itemid=1

Wednesday, February 29, 2012

ఆమె వాన నువ్వు


రోడ్డు మీద ఒక అమ్మ ఒక వాన కలగలిసిపోయి ఎలా ఇంటికి వెళ్లారో
చెప్పావొకసారి పిల్లవాడి మీద ప్రేమ ఇద్దరిలో ఎంత ఆర్తిగా కురిసిందో
అదంతా కలిసి ఒక హృద్యమైన పద్యం ఎలా అవుతుందో చూశాను

ఇక నువ్వొక పెద్ద అందమైన అద్దం ముక్కవి అయిపోయావు
ఒకసారి గుచ్చుకున్నావు, తియ్యని బాధ, డ్రాక్యులా పంటిది

వదల లేను, నీ నోటితో నన్ను పలకరించకుండా ఉండలేను
వస్తూనే ఉంటాను నువ్వు ఎక్కడ అని అడుగుతూనే ఉంటాను
కనిపించకపోతే నిన్నెవ్వరు మిస్ ప్లేస్ చేశారని కోప్పడుతుంటాను

కొలతలు కొంచెం మారినా అదే పతనమయిన దేవదూతల యాస
వ్యాంపైర్ భాష
పద్ధతికి దగ్గరిది, రాగ యుక్తమైనది, పుప్పొడి లేని పూల వనం

నీ ద్వారా వెళ్లడానికి ఏమీ ఉండదు, నీ అవతల నేను లేను

అంతా ఒక అతాత్విక యాగం ఒక శూన్యపు క్రతువు
ఆకాశ యానం, నేల మీద ఉన్నది నేలబారుది
నూతన మృదు పదాలు, ప్రాచీన హఠ యోగం
ఒక యుగ బీభత్సాన్ని దాచి పెట్టే అత్తరు గానం
మరోసారి నేను ఓడిపోయే మోహన వ్యూహం
   
ఆమె వచ్చినప్పుడు వానొచ్చినప్పుడు భలే మెరుస్తావు

నువ్వు లేవు, లేకుండా ఉండే విద్యను ఎక్కడో నేర్చావు
అవిద్యావంతుడివి అయితే గాని ఇలా మోహ పాశంతో
నన్నురితీయడం మానవు, రాకాసినై దొంగిలిస్తాను నీ విద్యను
దాచేస్తాను సకల సముద్రాల అడుగున ఇంకొక రోదసిలో

వెదుక్కుంటావు, ఏ పుస్తకంలో ఒక అదనపు పేజీ కనిపించినా
అది మనదని కావిలించుకుంటావు, మనది కాదది

నువ్వు వెదుకుతున్నది పాత నేల మాళిగ లోని ఒక అంధకార స్మృతి అని
నోరు తెరిచి నీకు చెప్పలేని చిత్ర ఛిద్రాక్షరం చట్టూ భ్రమిస్తూ ఉండిపోయావని
తెలియని నీలో బద్దలవుతున్న ప్రతిబింబాన్ని నేను, చూడగానే చెప్పగలను

ఇది శుభ్ర దర్పణమో మాయ ముకురమో, అప్పుడప్పుడు చూడలేను,
ఆమె కోసం వాన కోసం నిన్ను మోహించడం మాననంత వరకు… ….!
                                                          1-3-2012

A Break


Break in and listen to the rumblings
A conversation of irons, with words
On the way always to elsewhere
Sandy pebbles rolling on each other
Some thing invisible yet tangible
Like wetness in the eye, the desire
Burns without flame, the way irons burn
Cumulating the rust of ages on the wrists of the wearers

Break away singing marching songs
Age old discourse of the runaways, with sentences
Hanging down the necks as identity cards
Waves rolling on each other
Like molten mirrors
Molten but not hot, the desire again
Scorching the sinews with no heat to account for

Break out causing explosions all around
Throngs of soldiers after a defeated war
With no homes to go and no fields to sow
Just non-walking like lazy colors on the horizons
Words remembered in splinters as mutilated faces
You would construe some thing out of what remains
You being part of the left over, if lucky

Like me sitting in a corner of a room tentatively
Like the head of a snail at a corner of its shell which is ready
To be picked up by a child playing in the freshly rusted sands
Someday in the gray haired future
                                                           
28-2-2012

దృశ్యం


తోట తేనెటీగ తలలో ఝుమ్మని తిరుగుతుంటుంది
పువ్వులలో తల దూర్చి మత్తుగా నిద్రపోదామనిపిస్తుంది
ఆకులను పక్కకి జరిపితే అప్పుడేనా అంటుంది గొంగళి పురుగు
దాని మాట నాకు తెలియదు నా మాట దానికెలా తెలుసో
రాత్రికి నిద్రపట్టక వీథి కుక్కలను సతాయిస్తున్నది
గులకరాళ్లతో గోలీలాడుకోవడం కుదరదు ఇప్పుడు
చిన్ని చిన్ని ఆటల్లో ఓడిన ఉక్రోషంతో కాసేపు ఏడవొచ్చు కావాలంటే

తోట ఎప్పుడూ మాలి కోసిన పువ్వుల ధరవరలు ఆరా తీయకూడదు
ఇంకా బువ్వకు ఇంటికి వెళ్లడు ఎందుకో మ్లాన వదనుడు మాలి

ఈగ ఇంటికెళ్లే సరికి దాని రాణికి గర్భస్రావం అయ్యుంటుంది
పొగలో గూళ్లు శిశువుల గోరీలయి వుంటాయి ముట్టుకోవద్దు
ఇది ఒక దృశ్యం కరిగిపోతుంది
ఎచటికో వల పోవాలి మొదలెట్టాలి మళ్లీ ఒక్కొక్క మాటగా
కొన్ని తీపి పాటలు విశ్రాంతికి నిద్దర్రాకపోతే మరీ తిక్క రేగితే
వగరుకి ఒక క్రైమ్ థ్రిల్లర్ చదువుకో లేదా ఒక నిద్ర పద్యం

                                                12.30 PM, 28-2-2012

Monday, February 27, 2012

ఏమో...


వస్తే రావొచ్చు మళ్లీ ఇక్కడికి, ఈ అందమైన నిరర్థక నిశ్శబ్దం లోనికి
నిశ్శబ్దాన్ని పూజించే భద్ర జీవితం లోనికి
ఇప్పటికి సెలవు ఈ కాసిన్ని వ్యథలతో
ఊరి బయట పొంగిన వాన వాగును సముద్రం అనుకున్న క్షణాలు
బడి నుంచి ఇంటికి బహు దూరపు దారిలో గాలికి కంట్లో పడిన ఇసుక కణాలు
అపరాత్రి రామకృష్ణా బీచిలో కాసేపు నన్నెక్కించుకుని నడిచిన రెండేనుగు బొమ్మలు
ఒక్కొక్క హత్య వార్త విని ఎందుకు ఎందుకురా ఎందుకని కనుల ఉబికిన చెమ్మలు
పేదల నుంచి తీసుకోవడమే గాని
ఇవ్వడం తెలియని దేశం మీద ఎంత అనుకున్నా పుట్టని ప్రేమలు
ఏమో వస్తే రావొచ్చు ఇంకెటూ వెళ్ల లేక మళ్లీ ఇక్కడికి, ఈ గుహల్లోనికి
ఒక గడ్డి ఒల్లె, రెండు నీళ్ల కళ్లు గాక ఇంకేమీ గుర్తు చేయని కన్న తల్లికి
నేను ఏమిచ్చినట్లు సంకటిలో కన్నీళ్లు కలుపుకుని తిన్న కన్నతండ్రికైనా
ఏవో కొన్ని ప్రగల్భాలు కొంచెం వెలుతురు సోకితే టప టప లేచే గబ్బిలాలు
కండల బండలు ఒక దాని మీదొకటి చేర్చి కతువలు కట్టి చినుకులను ఆపి
చౌడు చేనిలో వరి పండించావా నాన్నా
నేను ఏమీ పండించలేదు, వరి అన్నం తింటున్నాను తరచు బిరియానీ కూడా
తిరుగబడిన పురాణ కథనమై, నాన్నా నేను మీ యవ్వనాన్ని తింటున్నాను
ఏమో చెప్పలేను వచ్చినా రావొచ్చు
అగ్గిపెట్టె రాక మునుపు ఊళ్లో పొయ్యి నుంచి పొయ్యికి పయనించిన నిశ్శబ్దపు
నిప్పుల గరిటెనై మళ్లీ
కచ్చితంగా చెబుతున్నాను, కొన్ని తరాల ఆకలిని, రాకుంటేనే వాళ్లకు మేలు
                                                                                    27-2-2012