Wednesday, November 16, 2011

విషం కైపు


ఏమి చెప్పినా మెల్లగా మెత్తగా చెప్పాలి
ఇక్కడ గాయపడని వారెవరూ లేరు
ఏమి అమ్ముతున్నదీ అర్థం కాకుండా
...మ్మో అని అరుస్తున్న వీధి ఆర్తనాదం
ఎంత మెల్లగా ఉంటుందెంత మెత్తగా,
ఇక మీ ఇష్టం అన్నట్టు
ఎవరికి మాత్రమిష్టం ఇదంతా, బాధ పడనిదెవ్వరు

మరిచే పోయాను అగ్గిపెట్టెలో దాచిన జీరంగిని
కిటకీ అవతల బంధించిన సీతాకోక చిలుకను
వెంటాడ్డం వేటాడ్డమేనా
వాటిక్కొంచెం జమ్మి ఆకుల మేత వెయ్యొద్దూ
తేనెలు కొల్లగొట్టడమేనా తీయ తేనియ బరువని
మత్తుగా పాడుకోవడమేనా,  మిగిల్చొద్దూ
కొన్ని పువ్వులు

అమ్మూ, నువ్వైనా చెప్పు నాకూ వాళ్లకు
ఆకు పచ్చని నీటిలో చెట్ల నీడల మునగ బెండ్ల మీద
ఈదుతూ ఎన్నాళ్లెన్నాళ్లైనా ఉండ వచ్చునని

అంతరంగంలో ఒక జారుడు మెట్ల దిగుడు బావి
కడవ కడవగా తడపాల్సిన గొంతుల కోసం
కాయలు కాచిన రైతు భుజం మీద నువ్వెప్పుడూ
ఆడుకోలేదనుకుంటా, మెత్తగా మెల్లగానే చెప్పాలి
ఏమి చెప్పినా, విషం కైపెక్కిన శంకరుడిలా
                                      16-11-2011

0 comments: