Tuesday, December 27, 2011

చెప్పగలనా


నిన్న సాయంత్రం ఆమెకు చెప్పలేకపోయాను
జేబులోంచి తీసి పూల పొట్లం విప్పలేకపోయాను
మెత్తని గేట్లు తెరిచి గుర్రాల్ని వదిలేసే లోగా
ఆకాశం తెగి, మా పెదాల మధ్య కూలిపోయింది
కోసు ముక్కలన్నీ ఏరేసి కర్చీఫ్ తో తుడిచి కూర్చుని
గుర్రాల్ని పట్టుకొచ్చే లోగా సాయంత్రం మాసిపోయింది
ఆమె నేను గుజ్జన గూళ్లలోంచి కాళ్లు తీసేసి
ఇసుక దులుపుకోవాల్సి వచ్చింది ఖాకులు వాల్తాయని
వెళ్లిపోవాల్సి వచ్చింది
ప్రేమ నిజమే గాని నేనొక దొంగను కాదు
దొంగల నాయకుడి సేవకుడినని
నా మొహం మీద గాటు యద్దంలో సంపాదించినది
కాదు, నాయకుడు చాచి కొడితే ప్రాప్తించినదని
రేపు సాయంత్రమైనా
పగలుకు రాత్రికి మధ్య టిక్కు టిక్కు తిరుగుతూ
పదే పదే గతాన్ని సంప్రదించే భూగోళకం తెగి
మా పెదాల మధ్య పడి పగిలే లోగా
ఆమెకు చెప్పగలననే అనుకుంటాను
ఇంత ఆటొమేటిక్ గా,  టిక్ టిక్ లోలకం చప్పుడును కాదని
ఆమెకు వినిపించేలా చెప్పలేనా, పోనిద్దూ, ఇక నిద్దర పోతాను
                                                2AM, 26-12-2011

1 comments:

koduri vijayakumar said...

అతి సున్నితమైన ఇలాంటి భావాలు/భావనలు కవిత్వంలో ఎప్పుడు/ఎన్నిసార్లు పలికినా 'ఎవర్ ఫ్రెష్ ' గానే ఉంటాయనుకుంటా...I enjoyed it HRK gaaru...!