Tuesday, December 27, 2011

చిలుకల దారిలో...


ఎగిరిపో చెప్పలేదా ఇక్కడ తోట లేదని పువ్వు మనిషీ
కుట్టుకో ఎలాగో చిరిగినవో విరిగినవో పగిలినవో రెక్కలు
నిన్న పుట్టిన పువ్వులు లేవు ఇక పువ్వులు పుట్టవు
సీతాకోక చిలుకలకు ముందే తెలుసు, ఎగిరిపోయినయ్
యాసిడ్ వానలే గాని వసంతం రాదని ఆకాశం వదిలి రామని
ప్రకటనలు వర్షించాయి మిగిలిపోయిన కొన్ని గడ్డిపోచల కోసం
రామచిలుకలకూ తెలుసు ఆ నాలుగు మాటలు చాలవని
ఏ చిలుకలనూ పిలవకు, నువ్వే వెళ్లు, కరిగిపో, ఎగిరిపో, లోపలికి
నీ లోపలి మొయిళ్ల లోపలి ఏడు రంగుల కెరటాల లోపలికి
తెలియక వుండిపోయావు, మట్టి రుచి మరిగిన శిశువువి, ఇంకా
ఉండాలనిపిస్తే ఎక్కడా వుండని చోటొకటి చూసుకుని వుండు కాసేపు
పిలవకు
ఎవరూ రారు లోపలికి, ఒక్కడివే, ఒకటి రెండు అర రెక్కల ఒక్కడివే
అరవకు
ఎవరూ రానివ్వరు లోపలికి తుప్పు పట్టిన ఇనుప గేట్లు తెరుచుకోవు
అడగకు
ఎవరూ పోనివ్వరు బయటికి, ఆకులు విరిగిన ఒంటి రథ చక్రం వదిలి
నువ్వు దొరికావన్న వాళ్ల పండుగ ముగ్గు లోంచి
ఎగిరిపో, ఎగిరి రెండు చేతులతో చుక్కల కొక్కీలు పట్టుకుని పైకి పైపైకి
                                                         
9.30 PM 27-12-2011

1 comments:

Afsar said...

ఎవరూ రారు లోపలికి, ఒక్కడివే, ఒకటి రెండు అర రెక్కల ఒక్కడివే
అరవకు
ఎవరూ రానివ్వరు లోపలికి తుప్పు పట్టిన ఇనుప గేట్లు తెరుచుకోవు
అడగకు
- బాగుంది, హెచ్చార్కే, కొత్త నడక, కొత్త దారి.