Friday, January 20, 2012

ఏక్‍తార మంద్ర నాదం


ఇంకెంత దూరం వెళ్తావు
మృత్యువు వినా బయటికి దారి లేని వ్యూహంలో

ఎక్కడో ఒక చరియ కొన్ని నీళ్లు ప్రాణం నిలబెట్టుకోడానికి
బతకడం బతకడం కోసమే అయితే బతకడమెందుకు

నిన్న జీనా హైతో... అంటివి ఇవాళ ఒంటరివి
ఎవరో కలిసినా కాసేపే, మిగిలేది నీకు నువ్వు

పెదిమలకు చేరే లోగా ఒక సారి విషం గ్లాసు లోనికి చూడు
అది నీ లోనికి చేరే లోగా ఒక సారి నువ్వు దాని లోనికి

ప్రతి గ్లాసులోనూ ఉంటాయి కొన్ని అలలు, ఎండకు పుట్టే రంగులు
కుదిరితే కాసేపు కలిసి కూర్చో, ఒక ఇరానీ చాయ్ లేదా ఒక చషకం

ఎవడికెవడూ లేడు అబద్ధం చెప్పకు/వినకు ఒకడికొకడు ఉన్నట్టు
ఉన్నదొక్కటే నీకు నీదై నీవై ఉన్నది లేదా ఉండనిది ఒక్క నువ్వే
 
ఉప్ప ఉప్పగా పక్క పక్కనే పాకుతుంటుంది మరణం
పంట పొలం కాదిది యుద్ధ భూమి, ఇంకా శాన్నాళ్లు

లోపల ఏదో ఉన్నట్టు మాటి మాటికి అంగీ చేతి కింద చేయి దూర్చకు
చాల అందమైన దానికై వెదుకుతున్నట్టు కళ్లు మత్తుగా వాల్చకు

ఎవడిదో పాటలో ఒక పల్లవి కావాలని నువ్వు అనుకున్నప్పుడే
పెనం మీద వెన్నలా నీ బాల్యం కరిగిపోవడం మొదలవుతుంది

మందల్లోకి వెళ్లి నీ యాట నువ్వు కొట్టుకొద్దామనునుకోకు
వంచన కొన్ని తరాలు అభ్యసిస్తే గాని అలవడని విద్య

వెదక్కు ఎడారి ఇసుక మేటల్లో గుడ్డి బిచ్చగాడివై
కొడిగట్టిన దీపం మీద రెప రెపలాడే జ్వాలా నేత్రమై

తను తినే జంతువును వధించే జంతువు మంచిది
చావును వినోదించదు, చావులో వినోదం మానవత్వం

మనుషులు మనుషులెలా అవుతారో మనుషులకు వదిలెయ్
నీ బతుకు నవ్వు బతుకు నీ మరణాన్ని నువ్వు ఆనందించు

లలిత లలితమైనవి కావాలని కోరకు సంస్కృత రాగాల కోసం జోలె పట్టకు
అవి నీ నుంచి కొట్టేయబడి పేర్లు మార్చుకున్నాయి, నీకు నువ్వు చాలు

బాగా తిన్నాక, నిద్రొస్తే నిద్ర పోయి లేచాక చల్లని నీడలు నటించు తావుల
గాలిని నెమరేస్తూ కూర్చుని కాకుండా ఎవడూ లాలిత్యం అనుభవించలేడు

కలిసొస్తే వస్తాడు నీతో సరిగ్గా నీలాంటి వాడు ఇంకొకడు, మరొకడు,
వేరొకడు తనను తాను తెలుసుకున్నవాడు, తెలుసుకున్న నాడు

నడవాలనిపిస్తే నడు నిద్ర పోవాలనుకుంటే నిద్ర పో
అన్నం దొరికితే భుజించు అంగీకారం దొరికితే సంభోగించు

లేడికి తెలుసు, పరుగులో అలిసిపోయి చనిపోవాలని, ఫిర్యాదు చేయదు
పరిగెత్తలేకపోయానని, ఒక నిట్టూర్పుగా వదుల్తుంది ప్రాణం

చిరుతకు తెలుసు పరిగెట్టలేకపోతే అకలితో చావాలని ఫిర్యాదు చేయదు
పరిగెత్తలేకపోయానని, సరి సరే లెమ్మని వదుల్తుంది ప్రాణం

వానప్రస్థమంటే, అర్ధ రాత్రి లేచి, కాసేపట్లో గడ్డ కట్టుకుపోతానని తెలిసీ
పక్క వాద్యం అక్కర్లేని ఈల పాట పాడుకుంటూ మంచు చీకట్లోకి వెళ్లిపోవడం

చివరి పాటకు మంద్రం మంద్రంగా మోగుతూ నీకు నువ్వే ఒక ఏక్‍తార
                                                          24-1-2012

1 comments:

Anonymous said...

good one sir