Sunday, January 22, 2012

శిరో దహనం


శిరో దహనం

ఎవరో పారేసిన బీడీ తాగబోయి తల కాల్చుకుంటున్న చిట్టీత చెట్టు
సారాయి సీసా కోసం అమ్ముడయిన దీవిలో విరిసిన ఒక నాగరికత

మండుతూనే ఉన్నాయి, చూడనట్టు నటించడమెందుకు
మంటలు భూమిని ముంచి ఆకాశాన్ని తాకుతున్నాయి

ఇక్కడ నన్ను ఎవరు వదిలేశారో, అరిచినా పలకరు
నేలను నింగిని కలుపుతున్న నా దుఃఖాన్ని వినరు

ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పోతాను, నేను వేయని మెట్లు
ఆకాశం అందదు గాని, అందుతుంది అని అనుకుంటాను

ఒక్కొక్క మెట్టు దిగుతూ పోతాను, కొండలు తొలిచి వేసినవి
మునుపటి జాడలు పట్టుకుని వెదుకుతాను నా ప్రపంచాన్ని

పిడుగు పాట్లకు పగిలినవీ వాన నీటికి అరిగిపోయినవీ
దారి గుర్తులుగా కొన్ని క్రూర వదనాల కోర్కెల కొండలు

మాసిన కొంగు సవరించుకుంటూ రోజూ కనిపించిన ఒక అమ్మ
చీకటి సందులలో ఈ మధ్య రెండు రోజులుగా కనిపించడం లేదు

ఆమె ఏమయిపోయిందని ఎవరినీ అడగను
అడగడానికి ఎర్ర దీపం వెలగని చోటు లేదు

అరిగిపోయిన మాటలకు ఆమె అగ్గి పెట్టి వెళ్లినవే
చీకటి వెలుగుల మధ్య మున్సిపల్ చెత్త మంటలు

ఎందుకు అని ఎవరినీ అడగను ఎవరైనా చెప్పబోయినా ఇక వినను
అడిగి విని అలసిపోయాను, నా హృదయం ఎటు చెబితే అటు వెళ్తాను

మీరా... మీ ఇష్టం...
మీరు అలసిపోయే వరకు
                                                            22-1-2012

1 comments:

Anonymous said...

good one sir