నేను చనిపోక పోతే పద్యం బతకదు
చాల సార్లు చూశాను,
ఇద్దరం ఉండొచ్చునంటే పద్యం ఒప్పుకోదు
నేనో నువ్వో ఒకరమే వుంటామంటుంది
మీరు చూశారుగా, నేనున్న చోట
కొన్ని మురికి కన్నీటి చుక్కలు, ఇంకొన్ని
వెకిలి జోకులుంటాయి, పద్యం వుండదు
కొన్ని సభల్లో
పద్యకులు కూర్చుని ఉండగా చూశాను
వాళ్ల చేతుల్లో నలిగిపోయిన మైకులను
ముట్టుకుని చూశాను, మొరటుగా డర్టీగా
ఉంది వాటి స్పర్శ
అందుకేనేమో త్రిపుర గారూ కాఫ్కా గారు ఇంకొందరు,
వాళ్లక్కూడా అది కుదర లేదు గాని, వారికి శుభమగు గాక,
తాము చనిపోయాకే తమ పద్యాలుండాలని అనుకున్నారు
మళ్లీ దిగులు
చనిపోవడం అంత సులభం కాదు
పద్యానికివేం పట్టవు
అడివి మధ్యలో బాటసారులు సేద దీరి
మంచి నీళ్లు తాగడానికి, అదొక చల్లని
అరుగు అయిపోవాలనుకుంటుంది
నువ్వేమో దాని మీద కూర్చుని
అమృతం తాగాలనుకుంటావు, వద్దు,
అనృతమది, తాగకు, చచ్చిపో, పద్యం కోసం
24-11-2011
3 comments:
KCR భాషలో చెప్పాలంటే, కర్రు కాల్చి వాత పెట్టినట్టు వుంది...'కవులు' అని కాకుండా, 'పద్యకులు ' అనడం కొంత గమ్మత్తుగా, ఈ పద్య సందర్భానికి తగినట్టు వుంది.
though & although it's good but not bad sir
Thank you very much Vijay, it is one of the traits, we the poets must overcome. I would and must add that I am also a target of the poem. :)
and thanks a lot Naidu.:) :)
Post a Comment