మిక్సర్ లో వేసింది వేరు తీసింది వేరు
రెండు రెండు కలిస్తే నాలుగు కానే కాదు
మరేదో చేరిపోతుంది విలువ మారిపోతుంది
ఒకే విత్తనంలోంచి ఆవులించిన రెండు అకులైనా
సీతాచిలుక రెక్కలైనా రెండు వాన చినుకులైనా
ఆ రెండు ఒక నువ్వు మరొక నువ్వే అయినా
బాగుంటుంది... పద్యాల బంతులతో ఆడుకోడం
వాడిపోని పదాల్ని నాభి నుంచి తోడుకోవడం
ఒకరికొకరు చెయ్యేసి చేదను పైకి లాగడం
బావి గట్టున కూర్చుని దోసిళ్లతో నీళ్లు తాగడం
గిలకల చప్పుళ్లతో గొంతులు కలిపి
కొన్ని రేపటి మాటలు గుర్తు చేసుకోవడం
చాంతాడు బావిలో వదిలి ఎవరికి వాళ్లు నడిచిపోవడం
తూనీగ కాలికి దారం కట్టి ఆడే బాల్యం మానవుడిది
అది అలవాటైతే ప్రతి నువ్వూ ప్రతి నేనూ ఒక టార్చర్ ఛాంబర్
రహదారి పక్కన పొదల్లో తుమ్మెదలుంటాయి
మాంసాహార పువ్వులు పూచే మొక్కలుంటాయి
చెప్పుకోవాలి ఒకరికొకరు, కాచుకోవాలి ఒకరి వీపు మరొకరు
మరోసారి అనుకుందాం, పంటపొలం కాదిది యుద్ధ భూమి
ఎప్పుడైనా అనిపించిందా, ఊహ కలత పెట్టిందా
ఎవరో నీ మెడకు పగ్గమేసి వాళ్ల చేనిలో దున్నిస్తే, నీ ఆకలి నీకు వేస్తే
నీ ప్రేయసి నీకు గుర్తొస్తే, నువ్వు నువ్వుగా కాకుండా ఒక దొడ్డిలో పొర్లాల్సి వస్తే
దొరికిందానితో రమించి పిల్లల్ని కనాల్సి వస్తే: ఆ దొడ్డిని కాచే జంతువు పేరేమిటి?
జంతువులను సరే, మనుషులను వాడుకునే జంతువు పేరు?
జవాబు తెలిసీ చెప్పక పగిలిన శిరసుల ముక్కలు, దారి పొడుగునా...
10.30 PM 22-1-2012
3 comments:
GOOD
good one sir
తెలియకుండానే కంటి నుండి నీరు జారింది ఇది చదువగానే!
Post a Comment